దొరల ఇంటికే పరిమితమైన బంగారు తెలంగాణ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు మాత్రం కనీసం ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని డాక్టర్ బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం రాత్రి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 148వ రోజు యాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పెద్దకల్వల, ఉదయ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, పేదల ఇళ్లను సందర్శించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల్లో భాగంగా దేహదారుడ్య పరీక్షలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నూతనంగా లాంగ్ జంప్ పెంచి అభ్యర్థులు క్వాలిఫై కాకుండా చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే నిబంధనలు సవరించి, లాంగ్ జంప్ దూరాన్ని నాలుగు మీటర్ల నుండి, 3. 8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బిసిలకు లక్ష కేటాయించాల్సి ఉండగా, కేవలం ఆరు వేల కోట్లు కేటాయించి మిగిలిన డబ్బంతా దొరలు లాక్కొని, కోటలు, సెక్రటేరియట్, ఇంద్ర భవనాలు కడుతున్నారని విమర్శించారు.
తక్షణమే బిసిల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన సందర్శించిన ఆయన హాస్పిటల్ లో అనేక సమస్యలున్నాయన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పి, కేవలం 7వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ లో, స్కానింగ్ సౌకర్యాలు లేవని, సాధారణ డెలివరీ కోసం ఒత్తిడి తెచ్చి పిల్లలను చంపుతున్నారని మండి పడ్డారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య, నియోజకవర్గ ఇంచార్జి దాసరి ఉష, పెద్దపల్లి జిల్లా ఇంచార్జి శేఖర్, అడ్వైజర్ మల్లేష్, నరేష్, మహిళా కన్వీనర్ స్వప్నగౌడ్, జోనల్ కన్వీనర్ సరిత, నియోజకవర్గ కన్వీనర్ శారద, నియోజకవర్గ అధ్యక్షులు దుర్గయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు.