కన్నవారిని కాదన్న కొడుకులపై ఆర్డీవోకు ఫిర్యాదు
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లి గ్రామానికి చెందిన కొలగాని లచ్చo, కొలగాని శంకరమ్మ అనే వయోవృద్ధులైన తల్లిదండ్రులు తమను వారి కుమారులు నానా హింసలు పెడుతున్నారని, ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వక పోగా ఇంట్లోనుంచి కొట్టి గెంటి వేశారని, తల్లి శంకరమ్మను మోరీలో నెట్టగా ఆమె చెయ్యి విరిగిందని, మమ్మలని చంపుతాం అని బెదిరింపులకు గురిచేస్తున్నారని వయోవృద్ధుల సంరక్షణ ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీవో మాధురికి ఫిర్యాదు చేశారు.
బుధవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయ ఆవరణలో వారు జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మా పోషణ, నివాస ఖర్చుల కోసం తన పేరు మీద ఉన్న భూమి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే ఎవరూ కొనకుండా బెదిరింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు ఆశ్రయం ఇచ్చిన మా అల్లుడిని, కూతుర్ని, మనుమడిని బెదిరింపులు చేస్తూ మమ్మల్ని వారి ఇంటి నుంచి సైతం వెళ్లగోట్టాలని ప్రయత్నాలు చేస్తూన్నారని, ఇదివరకు భూమి, ఇంటి స్థలాలు ఇచ్చినా, ముగ్గురికి మూడు ఇండ్లు కట్టించినా మిగిలిన నా భూమిని సైతం వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయమని లేకుంటే చంపుతామని బెదిరింపులు చేస్తున్నారని ఆ వయోవృద్ధులైన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.
తమకు తమ కొడుకులతో ప్రాణ భయం ఉందని తమకు పోలీసుల రక్షణ కల్పించాలని ఆర్డీవోను కోరారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంరక్షణ చట్టం మేరకు తల్లిదండ్రులైన వయోవృద్ధులను నిరాదరణకు, వేధింపులకు గురిచేసిన కొడుకులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే వీలును ట్రిబ్యునల్ ఛైర్మన్ లు అయిన ఆర్డీవోలకు అవకాశం ఉందన్నారు.
ఆ వయోవృద్ధుల వెంట తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కాన్సిలియేషన్ అధికారులు పి. సి. హన్మంత రెడ్డి, రఘుపతి, వి. ప్రకాష్, పి. ఆశోక్ రావ్ సీనియర్ సిటిజన్స్ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.