మరో దఫా వేటు.. మార్చిలో 11 వేల మంది ఉద్వాసనకు ఫేస్‌బుక్ రంగం సిద్ధం?!
Meta layoffs 2023 | ఆర్థిక మాంద్యం ముప్పు సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫార్మర్‌లీ ఫేస్‌బుక్) ను వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా మరోమారు భారీ లే-ఆఫ్స్ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గతేడాది నవంబర్‌లో మాదిరిగానే వచ్చేనెల ప్రారంభంలో మరో రౌండ్ లే-ఆఫ్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తున్నది. వచ్చేనెలలో పెర్ఫార్మెన్స్ బోనస్‌ల చెల్లింపులు పూర్తి కాగానే మెటా యాజమాన్యం.. లే-ఆఫ్స్ ప్రకటన చేయనున్నట్లు వినికిడి. మెటా యాజమాన్యం ఏ ప్రకటన చేస్తుందన్న విషయమై సంస్థ బయటా లోపలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. దాదాపు మరో 11 వేల మందిని వచ్చేనెలలో మెటా వదిలించుకోనున్నది.
గురువారం పొద్దుపోయిన తర్వాత వచ్చిన సమాచారం మేరకు కంపెనీ ఉద్యోగుల్లో 13 శాతం మందిపై లే-ఆఫ్స్ కత్తి వేలాడుతున్నట్లు తెలుస్తున్నది. అంటే సుమారు 11 వేల మందికి పింక్ స్లిప్‌లు అందజేయనున్నది. ఇందుకోసం సిబ్బంది గతేడాది పనితీరుపై `సబ్‌పార్ రేటింగ్స్ (subpar ratings)` ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. మెటా నాయకత్వం గత వారంలో రూపొందించిన రేటింగ్స్ నివేదిక ప్రకారం ఆయా రేటింగ్స్ వచ్చిన ఉద్యోగుల ఉద్వాసన తప్పక పోవచ్చునని వాల్‌స్ట్రీట్ జర్నల్ కూడా పేర్కొంది.
గత నెలలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్‌లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు మిడిల్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని క్యాటగిరీల ఉద్యోగాలను తొలగిస్తాం అని చెప్పారు. సంస్థను పునర్వ్యవస్థీకరిస్తామని, మరింత ఉత్పాదకత కోసం, ఇంజినీర్లకు సాయ పడేందుకు కృత్రిమ మేథ (ఏఐ) టూల్స్ వినియోగిస్తామని తెలిపారు. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని మెటా తొలగించింది. `ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ (year of efficiency)` కింద ఉద్యోగులను మరింత తగ్గించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. తాజా ఉద్యోగుల తొలగింపు వార్తలపై మెటా స్పందించలేదు.