పుట్ట మధు కు మంథని టికెట్ కష్టమేనా..??
బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గంలో పుట్ట మధు శాసనసభ అభ్యర్థిత్వంపై క్లారిటీ కరువైంది దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు పుట్ట మధుకు వీఆర్ఎస్ టికెట్ పై చర్చలు కొనసాగుతున్నాయి. మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా పెద్దపెల్లి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్న పుట్ట మధు విషయంలో జిల్లా మంత్రి స్పష్టత ఇవ్వకపోవడం, ఎంపి బోర్లకుంట వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలవరానికి గురి చేస్తున్నాయి.
నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరవుతున్నారు.ఈ ఈమధ్య రెచ్చపల్లి ఆర్ఆర్ కాలనీ మంథనిలోని డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రి పుట్ట మధు లాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పుట్ట మధుకర్ లాంటి ప్రజల కోసం పనిచేసే నాయకున్ని ఎమ్మెల్యేగా ఎన్నుకొని మంథని నియోజక వర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రజలను కోరారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఫిబ్రవరి 23న వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లగుంట వెంకటేష్ పుట్ట మధు టికెట్ కోసం సర్పంచ్, ఎంపీపీ, జడ్పిటిసి లాంటి అందరు నాయకులు కృషి చేయాలని అనడం కార్యకర్తల్లో అనుమానాలు మొలకెత్తించింది.
సాధారణంగా అధికారపాలక పక్షం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జికి టికెట్ ఇచ్చి పోటీలోకి దింపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అందుకు భిన్నంగా మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ టికెట్ పట్ల సందిగ్ధత నెలకొన్నది. నిన్నటి వరకు పుట్ట మధుతో అంటకాగి చేదోడు వాదోడుగా ఉన్న తూర్పు ప్రాంత నాయకుడు చల్లా నారాయణరెడ్డి కేసీఆర్ జన్మదినం రోజున కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం జరిపి అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించడం కార్యకర్తల్లో అయోమయానికి తెర లేపింది. వెనువెంటనే హైదరాబాద్ వెళ్లి హోమం ప్రసాదం, పట్టుబట్టలు ఎమ్మెల్సీ కవితకు అందజేయడం మంథని శాసనసభ టికెట్ విషయంలో ఉన్న అనుమానాలను బలపరుస్తోంది. వెనువెంటనే చల్ల నారాయణరెడ్డి మంథని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుంది. అసలు టికెట్ ఎవరికి వస్తుంది అనే కన్ఫ్యూజన్ కార్యకర్తల్లో మొదలైంది. అసలు ఎందుకు పుట్ట మధు విషయంలో ఇటువంటి అనుమానాలు పొడ చూపుతున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు.
కాగా ఈసారి ఎలాగైనా మంథని నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే కావాలని పుట్ట మధుకర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. మంథని నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి జాబ్ మేళా, ఆత్మీయ సమ్మేళనం, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ఇంతకుముందు సావిత్రిబాయి పూలే మాసోస్తవాలు ఏర్పాటు చేసి మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా మంత్రి కొప్పుల చేత ప్రారంభోత్సవాలు సైతం చేయించుతూ వస్తున్నారు. అయినా ఎక్కడో అనుమానం పొడచూపుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పుట్ట మధు అభ్యర్థిత్వం పట్ల తెర వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయో పసిగట్టలేని పరిస్థితి గోచరిస్తున్నది. ప్రతిపక్షాల పన్నాగమా సొంత పార్టీలోనే మోకాలు ఆడుతున్నారా అనేది ఇతమిద్ధంగా తేలడం లేదు. తాను చేర దీసినవారే గోతులు తవ్వుతున్నారా లోలోపల విష ప్రచారం చేస్తున్నారా? అనేది పుట్ట మధు సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. మంథని నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ తో పాటు పుట్ట మధు తన సొంత క్యాడర్ను కూడా నిర్మించుకుని ఎదురులేని నాయకునిగా చలామణి అవుతున్న తరుణంలో టికెట్ పై స్పష్టత రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. బహుజన వాదం, బీసీ వాదం ప్రాంతీయ వాదం అనేక విషయాలు ఈసారి మంథని నియోజకవర్గంలో ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే తన అనుచరులు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా పుట్ట మధుకు గుదిబండగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. పుట్ట మధుకర్ దగ్గర ఉన్న నాయకుల వ్యవహార శైలి కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారిందని పలువురు అనుకుంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అటు శ్రీధర్ బాబుకు ఇటు పుట్ట మధుకు జీవన్మరణ సమస్యగా మారిందనేది స్పష్టమవుతుంది.
2026 లో దేశవ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంథని నియోజక వర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉన్నది. తూర్పు ప్రాంతం ఎక్కువగా గిరిజన ఆదివాసులతో ఉండగా ఎస్టీ రిజర్వుడు అయ్యే అవకాశం ఉంది. అలాగే మానేరు పడమర వైపు ఉన్న మంథని ప్రాంతం మరో నియోజకవర్గం అయితే ఇక్కడ ఎస్సి రిజర్వుడు అయితే రాబోయే కాలంలో తమ రాజకీయ పరిస్థితి ఏమిటి అనేది రాజకీయ నాయకులు మల్ల గుల్లాలు పడుతున్నారు. పుట్ట మధు అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న సందిగ్ధతను ఇప్పటికైనా రాష్ట్ర నాయకులు కలగజేసుకొని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని అధిష్టానంతో మాట్లాడి అనుమానాలను తొలగిస్తే కార్యకర్తల్లో నెలకొన్న అనుమానాలు తొలగి అది రేపు జరిగే ఎన్నికల్లో పార్టీకి, అభ్యర్థికి బలాన్నిస్తుంది.తద్వారా అభ్యర్థి గెలుపుకు బాటలు వేస్తుంది. జన చైతన్య యాత్ర ముగింపులో భాగంగా కాటారంలో ఏర్పాటు చేసిన సభకు బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ హాజరై టిఆర్ఎస్ కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేస్తే మంథని ప్రాంతా నాయకులు ఖండించకపోవడం, చల్లా నారాయణరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించి బండిని సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.