ప్రీతి మరణం సమాజానికి తీరని లోటు : జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
ప్రతి మనిషిలో మార్పు రావాలని, అలా మార్పుతోనే మనుగడ సాధ్యమవుతుందని బీఆర్ ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు. మెడికో విద్యార్థి ప్రీతి మృతికి సంతాపం ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం మంథనిలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి బీఆర్ ఆంబేద్కర్ విగ్రహం వరకు. బీఆర్ ఎస్ పార్టీ మహిళ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ పాల్గొన్నారు.
ఈసందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ… మెడికో విద్యార్ధి ప్రీతి నాయక్ మృతి నేటి తరాన్ని, యువతను ఆలోచింపజేసే విధంగా ఉందన్నారు.ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో రికార్డు వింటే ఆమె ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులుపడినట్లు తెలుస్తోందన్నారు.ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మనిషిలో మార్పును తీసుకురావడానికి ఆ చట్టాలు పనిచేస్తలేవని స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఉన్నత చదువులు చదివిన వారే రాక్షసత్వంగా వ్యవహరించడం చాలా దౌర్బగ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుందని, ఇందులో ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, షీటీంల ఏర్పాటు చేసిందన్నారు. ఎక్కడ ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో పోలీసులు అక్కడకు చేరుకుని మహిళలను రక్షించేలా ఏర్పాట్లు చేసిందన్నారు. అయితే మానవత్వం మరిచిన మనుషులు మృగాళ్లుగా మారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వాపోయారు.
ఈనాడు తల్లిదండ్రులు ఆడబిడ్డను కనాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఆడబిడ్డను సోదరిగా బావించే ఆలోచన చేయాలని, అలాంటి పరిస్థితులు వస్తేనే ఇలాంటి సంఘటనలు జరుగవన్నారు. గొప్పగా చదువుకుని రాష్ట్రానికి, సమాజానికి ఉపయోగపడాల్సిన ప్రీతినాయక్ మరణం బాధాకరమని,ఆమె మరణంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ ఆడబిడ్డల గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొడుకులకు గారాబంగా పెంచే తల్లిదండ్రుల్లో సైతం మార్పు రావాలని, ప్రతి ఆడబిడ్డను సోదరిగాబావించేలా బుద్దులు నేర్పించాలన్నారు.ఇలాంటి సంఘటనలు జరుగుకుండా సోషల్ మీడియా, సోషల్ వర్కర్స్, మీడియాల్లో డిబెట్‌లు జరుగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రీతి మృతిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారని, కారకులకు శిక్షపడేలా చూస్తామని సైతం ప్రకటించారని ఆయన తెలిపారు.