నా భార్య అలిగింది సార్..సెలవులు ఇస్తే అత్తారింటికి వెళ్లొస్తా..పోలీస్ ఆఫీసర్ లేఖ వైరల్
యూపీలోని ఫరూఖాబాద్(Farrukhabad)జిల్లాకు చెందిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్(Police Inspecto) లేఖ సోషల్ మీడియాలో వైరల్(Viral Leave Application) అవుతోంది. హోలీ(Holi) సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉంటారు. దీంతో సాధారణంగా చాలా మంది పోలీసు సిబ్బందికి లీవ్‌లు రద్దవుతుంటాయి. అయితే పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ హోలీ పండగ సందర్భంగా తన సమస్యను చెప్పుకుని 10 రోజుల పాటు సెలవు కోరాడు. అయితే అతడి సమస్య విన్న అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. చివరికి సదరు ఇన్‌స్పెక్టర్‌కు 5 రోజుల సెలవు మంజూరు చేశారు ఎస్పీ.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్‌లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్… హోలీ పండుగ నేపథ్యంలో సెలవులు కోరుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీనాకు బుధవారం ఓ లేఖ రాశారు. ఆ లేఖలో..”హోలీ పండుగ రోజు నా భార్య నాతో కలిసి తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున పుట్టింటికి తీసుకెళ్లమని నా భార్య అడుగుతోంది. అయితే ప్రతి హోలీ పండుగ సమయంలో డ్యూటీ కారణంగా లీవ్ దొరక్క వెళ్లలేదు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పుట్టింటికి తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. ఆమెను శాంతింపజేయడానికి కచ్చితంగా నాకు సెలవులు అవసరం. నా సమస్యను అర్ధం చేసుకుని మార్చి4 నుంచి 10 రోజుల పాటు సెలవు ఇవ్వాలని కోరుతున్నాను”అని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా ముందు చేరినప్పుడు, అతను లేఖ చదివి నవ్వాడు. అనంతరం ఇన్స్పెక్టర్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఐదు రోజుల సెలవులకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, సెలవుల కోసం ఉద్యోగులు ఇలాంటి విచిత్రమై కారణాలతో దరఖాస్తు చేయడం ఇదే మొదటిసారి కాదు.