Print Friendly, PDF & Email

రవిశంకర్ సవాల్.. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి

0 5,888

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సవాల్ విసిరారు. కొండగట్టులో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా గంగధర మండలం మధురానగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసింది పాదయాత్రనా? లేక బస్సు యాత్రనా? అనేది జనాలకి ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టుని అభివృద్ధి చేసిందని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, అసలేం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కొండగట్టుకి వెయ్యి కోట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి

టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని రేవంత్‌రెడ్డి ‘బలి దేవత’గా అభివర్ణించారని రవిశంకర్ గుర్తు చేశారు. ఇప్పటికీ చంద్రబాబు తొత్తుగా, బినామీగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బస్సులో పాదయాత్ర చేస్తున్నాడని, ఈ యాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు.. కొండగట్టుకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం నీటితో చొప్పదండి నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యిందన్నారు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని, అసలు ఎలాంటి సమాచారమూ అందించడం లేదని పేర్కొన్నారు.

కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించామని రవిశంకర్ తెలిపారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి తెలుకోవాలని, చత్తీస్‌గఢ్ పథకాలు గురించి సభలో వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మేడిపల్లి సత్యంకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని, అసలు కాంగ్రెస్‌లో ఐక్యతే లేదని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి గంగాధరకి వచ్చి, అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేదన్నారు. రేవంత్‌కి దళితులంటే గౌరవం లేదన్నారు. రూ.1000 కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రవిశంకర్ మాటిచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలో స్థానికులకు మాత్రమే అవకాశం ఇచ్చి గెలిపిస్తారని వెల్లడించారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents