ట్రాన్స్ జెండర్ లు ‘ఇనామ్’ కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ! పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బ రాయుడు

కొంతమంది ట్రాన్స్ జెండర్  వర్గానికి చెందిన వారు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తూ ఉన్నవి.

ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు, గృహప్రవేశాలు,  పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించిన కొంతమంది ట్రాన్స్ జెండర్ లు, ఆ ఇంటి వద్ద వాలి పోయి, ఇంటి యజమానికి  చుక్కలు చూపిస్తున్న పలు సంఘటనలు మా దృష్టికి వస్తున్నవి. వేడుక జరుపుకునే  వారు వేలకు వేల రూపాయలు ఇచ్చేంతవరకు రకరకాలుగా వేధిస్తూ ఇంటిల్లిపాది ముందు దుర్భాషలు ఆడుతూ,  దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పలు సంఘటనలు దృష్టికి వస్తున్నవి.

అంతేకాకుండా ఎవరైనా  చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా స్మశాన వాటిక వద్దకు చేరిపోయి…. దుఃఖంలో ఉన్న వారిని కూడా  వదిలిపెట్టకుండా వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా  తెలుస్తుంది. ఇటువంటి వారు వారి జీవన ఉపాధి కోసం గౌరవంగా వుండే ఏదైనా  వృత్తి గానీ లేక చిన్న చిన్న పనులు  చేసుకుని జీవించాలి తప్ప ఇతరులపై పడి దౌర్జన్యంగా డబ్బులు సంపాదిస్తూ ఇతరుల శ్రమను దోచుకోవడం అనైతికం.

వారు గౌరవంగా జీవించడానికి ఇటీవల బ్యాంక్ ఋణాలు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, వారి ఆసక్తి మేరకు వాహనాలు నడుపుకుని జీవించడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మంజూరు చేయడం జరిగింది.
అయినా వారు తమ వైఖరి మార్చుకోకుండా దౌర్జన్యాలు చేస్తున్న సంఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతున్నవి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100  టోల్ ఫ్రీ నెంబర్ కు  కాల్ చేసి వివరాలు తెలియజేసినట్లయితే, ఐదు  నిమిషాలలో బాధితుల సమక్షంలోనికి దగ్గరలో వున్న బ్లూ కోల్ట్స్  సిబ్బంది , పెట్రో కార్ సిబ్బంది చేరుకొని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents