టీఎస్పీఎస్సీ వైపు దూసుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు
ప్రశ్నపత్రాల లేకేజీ ఘటనకు నిరసనగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట శుక్రవారం కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యాలయంలోకి దూసుకుపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించడం, వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గాంధీ భవన్లో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ల ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరుద్యోగుల అరి గోస కార్యక్రమానికి మద్దత్తు తెలపడానికి విచ్చేసిన శాసనసభ్యురాలు సీతక్క, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్
గాంధీభవన్ దీక్ష నుంచి
గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఉదయం నుంచి ‘నిరుద్యోగుల అరిగోస’ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ రోడ్డు మీదకు వచ్చి టీఎస్పీ ఎస్సీ కార్యాలయం వైపు పరుగెత్తుకు వెళ్లారు. కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని కట్టడి చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేసి పోలీస్టేషన్‌కు తరలించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణాన్ని రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసి విచారించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలిని పూర్తిగా రద్దు చేసి, టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిపాలనను సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని కమిటీ చేపట్టాలన్నారు. నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యే వరకు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని కంటీ పర్యవేక్షణలోనే అన్ని పరీక్షలూ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణతో న్యాయం జరుగదని తేల్చి చెప్పారు. సిట్ వాస్తవాలను బయట పెడుతుందనే నమ్మకం లేదన్నారు.