Print Friendly, PDF & Email

ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లు చెల్లించబోయి.. రూ. 7లక్షలు కోల్పోయిన ముంబై మహిళ.. అసలేం జరిగిందంటే?

0 11,463

దేశంలో ఆన్‌లైన్ మోసాలకు అంతులేకుండా పోతోంది. గత కొన్ని వారాల్లో సైబర్ చీటింగ్ కేసులు గణనీయంగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా చాలా మంది బాధితులు ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడ్డారు. మొబైల్ ఫోన్‌ల ద్వారా వచ్చిన SMS లేదా మెసేజ్‌లకు స్పందించి డబ్బును కోల్పోతున్నారు. ముంబైకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయింది. విద్యుత్ బిల్లుకు సంబంధించి (Fake SMS) మెసేజ్ ఫోన్‌కు రావడంతో ఆమె క్లిక్ చేసి బిల్లు చెల్లించేందుకు ప్రయత్నించింది. అంతే.. ఆమె అకౌంట్లో నుంచి 7 లక్షలకు పైగా కోల్పోయింది.

నివేదిక ప్రకారం.. ముంబైలోని అంధేరి ప్రాంతంలో నివసిస్తున్న మహిళకు భర్త ఫోన్‌లో విద్యుత్ బిల్లుకు సంబంధించి (SMS) వచ్చింది. సకాలంలో బిల్లు చెల్లించకుంటే తమ ఇంటి విద్యుత్‌ కనెక్షన్‌ను నిలిపివేస్తామని హెచ్చరిక కనిపించింది. SMSతో పాటు, పేమెంట్ చేసేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కూడా ఉంది. విద్యుత్ శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అని భావించి సదరు మహిళ ఆ ఫోన్ నంబర్‌కు కాల్ చేసింది. అదానీ ఎలక్ట్రిసిటీ కార్యాలయం (Adani Electricity office)లోని ఉద్యోగిగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ కాల్‌ను ఆన్సర్ చేశాడు. ఆ వ్యక్తి బాధితురాలికి బిల్లు చెల్లింపులో సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అందుకు ‘Team Viewer Quick Support‘ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని కోరాడు.

ఆ సూచనలను అనుసరించి, బాధితురాలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ID, పాస్‌కోడ్‌ను షేర్ చేసింది. వెంటనే గుర్తు తెలియని కాలర్‌కు ఆమె మొబైల్ ఫోన్‌కు యాక్సెస్ ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత బాధిత బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 4,62,959, రూ. 1,39,900, రూ. 89,000 లావాదేవీలు అయినట్టుగా బ్యాక్-టు-బ్యాక్ మూడు SMSలను వచ్చాయి. ఆమె అకౌంట్ నుంచి మొత్తం రూ.6,91,859 డెబిట్ అయింది.

 బాధితురాలి ఫిర్యాదు మేరకు..
SBI ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ బృందం కూడా ఆమెను సంప్రదించి ఇటీవలి లావాదేవీ జరిగిందా అని వెరిఫికేషన్ చేసింది. సైబర్ చీటింగ్ జరిగిందని తెలిసిన బాధితురాలు తన కుమార్తెతో కలిసి అంధేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై IPC సెక్షన్ 420, 66(C), 66(D) కింద కేసు నమోదు చేశారు. ముంబైతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. స్కామర్లు విద్యుత్ బిల్లులు నిలిపివేయడం లేదా బ్యాంకు అకౌంట్లను మూసివేయడం వంటి ఫేక్ SMS పంపుతారు. మెసేజ్‌లో ఫోన్ నంబర్‌లు లేదా లింక్‌లను షేర్ చేస్తుంటారు.

బాధితుడు అది నిజమేనని భావించి SMSలో లింక్‌పై క్లిక్ చేస్తే అంతే సంగతులు.. ఫోన్ కాల్ తర్వాత, స్కామర్‌లు బాధితుడి ఫోన్ నంబర్‌కు యాక్సస్ పొందుతారు. వారి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బును దొంగిలిస్తారు. అందుకోసం బాధితుల నుంచి OTPని కూడా అడుగుతారు. ఇలాంటి స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండాలంటే.. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చిన SMS మెసేజ్‌ల్లో లింక్‌లపై క్లిక్ చేయకపోవడమే మంచిది.

బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు అలాంటి SMS మెసేజ్‌లు పంపవని గమనించాలి. అంతేకాదు.. ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ఏదైనా OTP లేదా యాప్ డౌన్‌లోడ్‌ల చేయమని అడగరని గమనించాలి. మీరు SMS లేదా WhatsApp ద్వారా ఇలాంటి మెసేజ్ పొందితే.. ఆ మెసేజ్ వెంటనే ఫోన్ నుంచి డిలీట్ చేయండి. ఆ గుర్తు తెలియని నంబర్ వెంటనే బ్లాక్ చేయండి. ఆ విషయాన్ని బ్యాంక్ లేదా సైబర్ సెల్‌కు రిపోర్టు చేయండి.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents