Print Friendly, PDF & Email

అట్టుడుకిన ఉస్మానియా యూనివర్సిటీ.. విద్యార్థి జేఏసీ నేతల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత..

0 1,425

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనలతో ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడుకిపోయింది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్‌ చైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్ష ఓయూలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

నిరుద్యోగ మార్చ్ పేరుతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీకి పిలుపునిచ్చాయి పలు విద్యార్థి సంఘాల జేఏసీలు. దాంతో ఓయూలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది.

అయితే, విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా మోహరించారు పోలీసులు. యూనివర్సిటీ లోపలికి వచ్చే రెండు గేట్లను మూసివేశారు. ఓయూలో విద్యార్థి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇక విద్యార్థుల మార్చ్‌కి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఆయా పార్టీల నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు.

Telangana: అట్టుడుకిన ఉస్మానియా యూనివర్సిటీ.. విద్యార్థి జేఏసీ నేతల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత..

కాంగ్రెస్ నిరసనలు..

ఇక విద్యార్థుల నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. దీక్షకు అనుమతివ్వకపోయినా చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఓయూ మెయిన్ గేట్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు హల్‌చల్ చేశారు. ర్యాలీగా వచ్చి మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఓయూ మెయిన్ గేట్ మూసి ఉండడంతో గేట్లు దూకి ఓయూ లోపలికి వెళ్లి దీక్షకు కూర్చున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. దాంతో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు.

రేవంత్ రాకపై బీఆర్ఎస్‌వి నేతల ఆగ్రహం..

నిరుద్యోగ మార్చ్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం, మార్చ్‌లో పాల్గొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ప్రకటించారు. ఓయూలోకి అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రాజకీయం కోసమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూను అడ్డుపెట్టుకుని ఉస్మానియాలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారని, ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అంటూ తీవ్రంగా స్పందించారు గెల్లు శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎలా అడుగు పెడతాడంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని ఓయూలో అడుగుపెట్టనీయం అన్నారు. గతంలో నాగం జనార్ధన్ రెడ్డికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు. గతంలో ఉస్మానియా విద్యార్థులను బీరు, బిర్యానీతో పోల్చి అవమానించావని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు శ్రీనివాస్ యాదవ్. కాగా, ఈ ఉద్రిక్తత నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్, జేఏసీ నేత విజయ్ లు పేర్కొన్నారు. ఓయూలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ మార్చ్ చేస్తున్న విద్యార్థి నాయకులు భీంరావు నాయక్, మిడతన పల్లి విజయ్, బండి నరేష్, కె.వెంకట్ యాదవ్ లను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ తో 30 లక్షలు పైగా విద్యార్థి నిరుద్యోగులు ఆవేదన చెందుతుంటే.. ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష పత్రాలు లీకేజ్‌కి మూలకారకులైన చైర్మన్, బోర్డ్ సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ గానీ, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉద్యోగల భర్తీ క్యాలెండర్ ప్రకటించాలనీ, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల బృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 క్యాలిఫై అయిన అభ్యర్థులకు వెంటనే నష్ట పరిహారం ప్రకటించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు విద్యార్థి నాయకులు. ఈ విద్యార్థి నిరుద్యోగ మార్చ్‌ను ఆపాలని ప్రభుత్వం చూస్తే త్వరలో నిరుద్యోగ విద్యార్థి మార్చ్ అన్ని యూనివర్సిటీల్లోనూ, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని ప్రకటించారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents