బండి సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: ఎమ్మెల్యే
బండి సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీ. ఆర్. ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ బుధవారం పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌తో పోటీపడలేక బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దల డైరెక్షన్‌లోనే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పెట్టిన ప్రశాంత్‌ది బీజేపీ సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర అని తెలిపారు. తెలంగాణకు పెట్టబడులు వస్తే బీజేపీ నేతలకు కండ్లు మండుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ చిల్లర పనులకు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.