పీఎం మోడీ బండి సంజయ్ మధ్య ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం
హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రస్తుతం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పిక్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎయిర్ పోర్ట్ స్వాగతించడానికి వెళ్ళిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాని మోడీకి రెండు చేతులతో నమస్కరించి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
ప్రోటోకాల్ ప్రకారంగా గవర్నర్ తమిళి సై నరేంద్ర మోడీని స్వాగతించగా బిజెపి ఎంపీలు, రాష్ట్ర ముఖ్య నేతలు అందరూ ఆయనకు స్వాగతం తెలిపారు. అయితే ఈ సమయంలో బండి సంజయ్ చేతులు పట్టుకొని ప్రధాని మోడీ నవ్వుతూ అభినందిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో ను బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని తెలంగాణలో 11,300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల బహుమతితో ఆయన వచ్చారని పేర్కొన్నారు.
ఇక ఇదే ఫోటోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లక్ష్మణ్ కూడా నవ్వుతూ కనిపించారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ నమస్కారం చేయగా, వారికి ప్రతి నమస్కారం చేస్తూ వచ్చిన మోడీ, బండి సంజయ్ వద్దకు రాగానే ఆయన చేతులు పట్టుకుని మరీ అభినందన పూర్వకంగా నవ్వారు.
ఇటీవల రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్టుతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ చేతులు పట్టుకుని, మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చినట్టుగా ఆ ఫోటో ఉందని బిజెపి శ్రేణులు భావిస్తున్నాయి.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్టు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయంపై ఆరా తీశారు. ఆ తర్వాత రెండు రోజులపాటు జరిగిన పరిణామాలు, ఇక తాజాగా బండి సంజయ్ కు బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.