నా ఫోన్ పోయింది.. పోలీసులకు బండి ఫిర్యాదు
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికి వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొబైల్ ఫోన్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
తన ఫోన్ కనిపించడం లేదని, విచారణ జరపాలని ఆయన కరీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. లీకేజే కేసులో ఈనెల 5న తనను అరెస్ట్ చేసినప్పుడు జరిగిన తోపులాటలో ఫోన్ ఎక్కడో పడిపోయిందని వివరించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా స్టేషన్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. లీక్ తర్వాత నిందితుడు, జర్నలిస్ట్ బూరం ప్రశాంత్ బండి సంజయ్‌కి ఫోన్లో క్వశ్చన్ పేపర్ పంపినట్లు పోలీసులు చెప్పడం తెలిసిందే.
మరిన్ని వివరాల కోస ఫోన్ ఇవ్వాలని కోరగా, అది పోయిందని ఆయన చెప్పారని పోలీసులు అంటున్నారు. లీక్ కేసు దర్యాప్తులో ఆయన ఫోన్ కీలకంగా మారిందని, అందులోని డేటా వెలికి తీస్తే నిజానిజాలు తెలుస్తాయనంటున్నారు. ఇప్పుడు ఫోన్ కనిపించట్లేదని, మీరే వెతికి ఇవ్వాలన్నట్టు బండి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. కాగా ఈ కేసులో శనివారం మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా కమలాపూర్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష రాసిన హరీశ్ అనే విద్యార్థి దగ్గరి నుంచి పేపర్ లీక్ అకాడం తెలిసిందే. అయితే లీక్ ఎలా అయింది? వాట్సాప్ గ్రూపుల్లో ఎలా వైరల్ అయింది అనే విషయాలపై చాలా సందేహాలు వస్తున్నాయి. హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్లు డిబార్ చేయగా హైకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసి పరీక్షకు అనుమతించింది.