అమృత్‌పాల్ వీడియో ఎఫెక్ట్…పంజాబ్‌లో భద్రత కట్టుదిట్టం
బైసాఖి వేడుకల నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిక్కుల ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ వేడుకలను వేదికగా చేసుకోవాలని ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ తన అనుచరులకు పిలుపునిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీనిని అధికారులు ధ్రువీకరించకపోయినప్పటికీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతను భారీగా పెంచుతున్నారు. అదనపు డీజీపీ సురీందర్‌పాల్ సింగ్ పార్మర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు ఆయన తెలిపారు.
”ఏప్రిల్ 14న బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని జన జీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలో విస్త్రృత చర్యలను చేపట్టాం. ఎవరూ భయపడాల్సిన పని లేదు. బైసాఖి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వీలైనంత ఎక్కుమంది భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని మేం చాటి చెబుతాం.పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేవు.” అని ఏడీజీపీ సురీందర్‌పాల్ తెలిపారు.
మరోవైపు ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ఉసిగొల్పుతున్న ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఏప్రిల్ 2న పోలీసులకు లొంగిపోయారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వాటి సారాంశం. అయితే, ఈ వార్తలను పంజాబ్ పోలీసులు కొట్టిపారేశారు.అవన్నీ అవాస్తవమని, ఒకవేళ అమృత్‌పాల్ పోలీసులకు లొంగిపోతే.. చట్టానికి లోబడి ఆయనకు సాయం చేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధంగా ఉందని డిప్యూటీ కమిషనర్ పర్మీందర్ సింగ్ భందాల్ పేర్కొన్నారు. అమృత్‌సర్ ప్రజల సౌకర్యం, భద్రతకోసం నిత్యం అలుపెరుగకుండా పని చేస్తూనే ఉంటామన్న ఆయన.. బైసాఖి వేడుకల నేపథ్యంలో ప్రస్తుతం ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించామన్నారు.
ఇటీవల అమృత్‌పాల్ సింగ్ పేరుతో ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. తాను దేశం నుంచి తప్పించుకోలేదని, త్వరలోనే ప్రపంచం ముందుకు మళ్లీ వస్తానని చెప్పడం ఆ వీడియో ముఖ్య ఉద్దేశం. అయితే, బైసాఖి పర్వదినం సందర్భంగా పంజాబ్‌లో అలజడులు సృష్టించేందుకు అమృత్‌పాల్ వస్తాడనే ఉద్దేశంలో పోలీసులు ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.