పెళ్లి మండపంపై వధూవరుల కొట్లాట.. రెజ్లర్లను తలపించిన ఫైటింగ్.. వీడియో వైరల్
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులు చాలా సంతోషంగా కనిపిస్తుంటారు. ఒకరికి ఒకరం తోడు అనుకుంటూ ప్రేమ, ఆప్యాయతలు చూపించుకుంటారు. కానీ ఒకచోట మాత్రం పెళ్లి తంతు జరుగుతుండగా వధూవరులు పోట్లాటకు దిగారు.
ఒకరిపై ఒకరు పంచుల వర్షం కురిపించుకున్నారు. వారు పెళ్లి మండపాన్ని కాస్తా డబ్ల్యూడబ్ల్యూఈ రింగుగా మార్చేశారు. వీరు కొట్టుకుంటుంటే అతిథులు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా తగ్గేదేలే అన్నట్లు ఒకరికొకరు జుట్టుపట్టుకొని మరీ తన్నులాడుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్లి మండపం పైనే రెజ్లర్లలా కొట్టుకుంటున్నారంటే.. ఇక పెళ్లయ్యాక ఏం చేస్తారోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
* స్వీట్ కాస్త చేదు మిగిల్చింది
@gharkekalesh అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసిన ఒక వీడియోలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు మండపంపై నిల్చుని ఉండటం చూడవచ్చు. తర్వాత వరుడు వధువు నోటిలో స్వీట్ పెట్టి తినిపించాలని ప్రయత్నించాడు. కానీ అదే స్వీట్ తనకి చేదు అనుభవాన్ని మిగుల్చుతుందని ఊహించలేకపోయాడు. అందుకే తనకి స్వీట్ వద్దు అన్నట్లు ఆమె అతడిని వారించినా వినకుండా తినమని బలవంతం చేశాడు. అంతే, చిర్రెత్తుకొచ్చిన ఆ నవవధువు వరుడు చేతిని పక్కకి నెట్టేసింది. ఆపై వరుడి చెంప చెల్లుమనిపించింది.
ఈ సీన్ ఊహించని అతిథులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లి రోజు వధువు చేత చెంప చెల్లుమనిపించుకున్న వరుడి ముఖం అప్పటికే మాడిపోయింది. తర్వాత భర్తనే కొడతావా అన్నట్లు అతడు కూడా రెచ్చిపోయాడు. ఆమె చెంపలను చెడమడా వాయించేశాడు.
* రెచ్చిపోయిన వధువు
వరుడు చెంప దెబ్బలు కొడుతుంటే వధువుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే, ఆ యువతి అతడిపై విరుచుకు పడింది. వరుడు తనని కొడుతూ జుట్టుపట్టుకోగా.. తానేం తక్కువ తినలేదన్నట్లు ఆమె కూడా జుట్టు పట్టుకుంది. తర్వాత వరుడు తన తలపాగా కింద పడేసి మరీ “రా చూసుకుందాం” అన్నట్లు వధువుపై దాడి చేశాడు. ఆపై ఇద్దరు ఒకరికి ఒకరు తోసుకుంటూ వివాహ వేదికపై పడిపోయారు. వారిని ఆపేందుకు అతిథులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
* నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
లక్షల్లో వ్యూస్ వచ్చిన ఈ వీడియో చూసి కొందరు నెటిజన్లు నవ్వుకోగా, మరికొందరు ఈ వధూవరుల తీరుపై మండిపడ్డారు. “వీళ్లేంటి ఇలా ఉన్నారు, పెళ్లి రోజే డివోర్స్ తీసుకునేలా ఉన్నారే” అని కామెంట్స్ చేశారు. “వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి చాలా ద్వేషం ఉన్నట్టుంది. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్‌గా ఉండటమే బెటర్” అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది ఫేక్ అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మండపంపై కనిపించిన అతిథులలో ఒకరు నవ్వుతున్నారని, బహుశా ఇది ఫేక్ కావచ్చని వారు కామెంట్లు పెట్టారు. ఏదేమైనా చూసేందుకు ఈ ఆలుమగలు నిజంగానే కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకుందనేది తెలియ రాలేదు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022