ఇంటికెళ్లి దాడి చేశారు ..అటుపై తుపాకీతో కాల్చారు.. కరీంనగర్‌లో కాల్పుల కలకలం
కరీంనగర్ జిల్లాలో బుధవారం అర్దరాత్రి ఓ వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులపై కొందరు షడన్‌గా అటాక్ చేసారు.
ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపి గాయపర్చారు. ఈఘటన జిల్లాలో కలకలం రేపింది. మానకొండూరుకు చెందిన బాసబోయిన అరుణ్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు దాడి చేశారు. దుండగుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు అరుణ్ పారిపోతుండగా గన్‌తో కాల్పులకు తెగబడ్డారు. గన్ మిస్ ఫైర్ కావడంతో స్వల్ప గాయాలతో అరుణ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో తుపాకీ కలకలం సృష్టించింది.
కరీంనగర్ జిల్లాలో కాల్పుల కలకలం..
కరీంనగర్ జిల్లాలో కొత్తగా గన్ కల్చర్ కలకలం రేపుతోంది. గంజాయి అమ్ముకునే జీఎం కాలనీకి చెందిన బన్నీ అలియాస్ సాయితేజ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి వచ్చి అరుణ్ అనే వ్యక్తితో పాటు అతని కుటుబం సభ్యులపై దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి మానకొండూర్ కు చెందిన బాసబోయిన అరుణ్ మీద ముగ్గురు వ్యక్తులు దాడిచేసి తపంచాతో బెదిరించినట్లుగా బాధితుడు తెలిపాడు. తనపై దాడి చేసిన వారిలో గోదావరిఖనికి చెందిన బన్నీతో పాటు చంటి ఉన్నట్లు తెలిపాడు బాధితుడు. అరుణ్ మహబూబాబాద్‌లో ఇరిగేషన్ శాఖలో అటెండర్ గా పనిచేస్తున్నాడు.
బుధవారం రాత్రి జరిపిన దాడిలో అరుణ్‌తో పాటు ఆతని పెద్ద కూతురు, ఇంటి పక్కన ఉంటున్న వారిపై కూడా దుండగులు దాడి చేశారు. వాళ్లు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులిచ్చిన సమాచారంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కాల్పులు జరపడానికి నిందితులు తపంచా వాడినట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ పై బీరు సీసాతో దాడి చేసి తర్వాత తపాంచాతో హల్చల్ చేసినట్లు తెలిసింది.
గాయపడిన అరుణ్ తనపై దాడి చేసిన వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలిపాడు. వాళ్లంతా గంజాయి అమ్ముకునే వాళ్లని…వారితో తనకు ఎలాంటి పరిచయాలు, పాత గొడవలు లేవని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యాదగిరిగుట్టకు చెందిన మల్లేశంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు, మానకొండూరు సిఐ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తం ఘటనలో నలుగురిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇద్దర్ని పట్టుకున్నారు. నిందితులపై నేరచరిత్ర ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.