తెలంగాణ వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆందోళనలు..గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని పేర్కొనడం ఈ ఆందోళనకు కారణంగా మారింది.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద బజరంగ్ దళ్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు.
అంతేకాదు గాంధీభవన్ ముందు కూర్చొని హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు యత్నించారు. దీనితో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బజరంగ్ దళ్ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా భారీగా గాంధీభవన్ వద్దకు చేరుకుంటున్నారు. దీనితో పోలీస్ బలగాలు మోహరించాయి. అలాగే బారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు.
బీజేపీ శ్రేణులు ర్యాలీగా గాంధీభవన్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా గాంధీభవన్ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళన చేపడుతుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై బజరంగ్ దళ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్..జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
కాంగ్రెస్కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ప్రకటించిన మేనిఫెస్టోలో… ఓ వివాదాస్పద హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక… భజరంగ్‌దళ్, PFI తదితర సంస్థలు.. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆందోళనలు చేస్తే.. అలాంటి సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. అవసరమైతే ఆ సంస్థల్ని పూర్తిగా బ్యాన్ చేసేందుకు చట్టపరంగా ముందుకెళ్తామని హామీ ఇచ్చింది. ఇదే ఇప్పుడు కర్ణాటకతోపాటూ… దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.