ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని పెంచి, పెద్ద చేసి… వారికో జీవితాన్ని ఇస్తారు. ఇందుకోసం తమ జీవితాన్ని వారి కోసం త్యాగం చేస్తారు. ఎన్ని కష్టాలైనా భరిస్తూ..
ఆ విషయాల్ని పిల్లలకు తెలియనివ్వరు. మరి ఇంతా చేసిన వారిని.. పెద్దయ్యాక పిల్లలు ఆదుకోవాలి కదా. తల్లిదండ్రులు భారం అని అనుకుంటే ఎలా? అలా అనుకున్న నలుగురు కొడుకుల తీరుతో ఆ తండ్రి గుండె బద్ధలైంది. వారికి భారంగా బతకడం కంటే.. చితిపై చావడం మేలనుకొని.. ప్రాణాలు విడిచాడు. ఇంతకంటే విషాదం ఏముంటుంది? సిద్దిపేట జిల్లా… హుస్నాబాద్ మండలం… పొట్లపల్లిలో ఈ దారుణం జరిగింది.
ఆ పెద్దాయన పేరు మెడబోయిన వెంకటయ్య. వయసు 90 ఏళ్లు. భార్య ఆల్రెడీ చనిపోయింది. నలుగురు కొడుకులూ, ఓ కూతురు. వయసు మీదపడటంతో… 4 ఎకరాల భూమిని నలుగురు కొడుకులకూ సమానంగా పంచాడు. ఐతే.. ఆ కొడుకులు.. తండ్రిని చూసుకునే విషయంలో వంతులు పెట్టుకున్నారు. నెలకు ఒకరి దగ్గర ఉండేలా పెద్ద మనుషుల పంచాయతీలో తీర్పు ఇచ్చారు. ఆ ప్రకారం.. 5 నెలలుగా ఒక్కో నెలా ఒక్కో కొడుకు దగ్గర ఉంటున్నాడు. ఐతే.. నలుగురు కొడుకుల్లో ఇద్దరు మాత్రమే పొట్లపల్లిలో ఉంటున్నారు. మరొకరు హుస్నాబాద్‌లో, ఇంకొకరు కరీంనగర్ జిల్లా.. నవాబుపేటలో ఉంటున్నారు.
తాజాగా పెద్ద కొడుకు వంతు పూర్తవడంతో.. నవాబుపేటకు వెళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా నెలకోసారి ఇళ్లు మారాల్సి రావడం పెద్దాయనకు సమస్యగా అనిపించింది. అదే సమయంలో తాను కొడుకులకు భారమైపోయాననే భావన ఆయన్ని బాగా కుంగదీసింది.
తాజాగా మే 2న సాయంత్రం పెద్దకొడుకు ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధ చెప్పుకున్నారు. 3న ఉదయం నవాబుపేటకు బయల్దేరారు. కానీ సాయంత్రమైనా ఆయన అక్కడికి వెళ్లలేదు. దాంతో… ఆయన కోసం కొడుకులు వెతకగా.. 4న మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట దగ్గర మంటల్లో కాలిన మృతదేహం కనిపించింది. అది వెంకటయ్యదేనని గుర్తించారు. ఎండిన తాటి ఆకులను కుప్పగా వేసి… వాటికి నిప్పంటించి, వాటిలో దూకి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. దీనిపై కేసు రాసిన ASI మణెమ్మ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.