పెన్షన్ డబ్బుల కోసం అన్నదమ్ముల గోడవ, అడ్డువచ్చిన బావ మృతి
జగిత్యాల జిల్లాలో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.కన్నతల్లికి వచ్చే వృద్దాప్య పెన్షన్ కోసం అన్నదమ్ములు గొడవపడ్డారు. తల్లికి వచ్చే రెండు వేల రూపాయలు తీసుకునేందుకు బాహాబాహీకి దిగారు. నలుగురిలో అన్నదమ్ములు గొడవపడటం చూసిన వాళ్ల బావ సర్ది చెప్పి గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్లాడు. అంతే అన్నదమ్ముల తోపులాట మధ్యలోకి వెళ్లిన బావ కిందపడటంతో తలకు బండరాయి తగిలి తీవ్రగాయమవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే ఘర్షణ ఆపేందుకు వెళ్లిన అమాయకుడు అన్నదమ్ముల రెండు వేల రూపాయల పంచాయితీలో ప్రాణాలు కోల్పోవడం చూసి గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఈసంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీలో చోటుచేసుకుంది.
పెన్షన్ డబ్బుల కోసం గొడవ..
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆస్తి కోసం తన్నుకున్నట్లుగా తల్లికి వచ్చే వృద్దాప్య ఫించన్ కోసం అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. జిల్లా కేంద్రంలోని విజయపురి కాలనీకి చెందిన హయాత్, తాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తల్లి వజీర్ బీకి వచ్చిన ఫించన్ డబ్బులు రెండు వేల రూపాయల కోసం శుక్రవారం ఉదయం గొడవపడ్డారు. ఇద్దరూ గొడవపడటం చూసిన హయాత్, తాజ్ బావ నయిమ్ వాళ్లకు సర్దిచెప్పి గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్లాడు. అన్నదమ్ములు బాహాబాహీకి దిగడంతో పెనుగులాట జరిగింది. మధ్యలో వెళ్లిన నయిమ్ కిందపడ్డాడు. అక్కడ గోడ పునాది కోసం వేసిన రాయి తలకు తగలడంతో నయిమ్‌కు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు.
బావ ప్రాణం తీసిన బావమరదులు..
రెండు వేల రూపాయల ఫించన్ కోసం అన్నదమ్ములు ఇద్దరూ కలిసి బావ ప్రాణాలు పోవడానికి కారణమైన సంఘటన విజయపూరి కాలనీలో కలకలం రేపింది. నయిమ్ చనిపోయి పడివుంటడాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. డబ్బు కోసం కనీసం ప్రాణాలు పోతున్నా లెక్కచేయరా అంటూ అన్నదమ్ముల్ని తిట్టిపోశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ కోసం గొడవపడిన హయాత్, తాజ్ అనే ిద్దరు అన్నదమ్ముల్ని విచారిస్తున్నారు.