బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. హైకమాండ్ సంచలన ప్రకటన..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మార్చనుందన్న నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ రాజీనామా చేశారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా లేఖను హైకమాండ్ కు అందించారు. కాగా, కొన్ని రోజుల నుంచి తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు అంతర్గత పోరు.. మరోవైపు ఒకరిపై మరొకరి ఆరోపణలు.. బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించిన హైకమాండ్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, నాయకత్వ మార్పు అనంతరం బండి సంజయ్ కు కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం..
కాగా.. బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలతోపాటు.. పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రకటించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని ప్రకటించింది. అంతేకాకుండా.. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను ప్రకటించారు.