నేడు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్
అత్యవసర, కొవిడ్ సేవల మినహాయింపు
సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) ఆయుర్వేద వైద్యులకు 58 రకాల శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్‌లు శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రుల దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర, కొవిడ్ సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేయనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డా.లవకుమార్‌రెడ్డి, ఛైర్మన్ డా.అశోక్‌రెడ్డి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డెక్కన్ బ్రాంచ్ కార్యదర్శి డా.శ్రీకాంత్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని కోరారు. జూడాల మద్దతుఆయుష్ వైద్యులకు కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ శుక్రవారం చేపట్టనున్న దేశవ్యాప్త ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలంగాణ జూడాల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. నిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం కూడా ఐఎంఏ నిరసనకు మద్దతు ప్రకటించింది.