నాపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది : పుట్ట మధు
పెద్దపల్లి : తనను రాజకీయంగా దెబ్బతిసేందుకు కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. శనివారం పెద్దపల్లిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొని ఆయన మాట్లాడారు. తానెక్కడికీ పారిపోలేదని మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. న్యాయవాద దంపతుల హత్యపై పోలీసుల విచారణ తర్వాతే స్పందిస్తానని పేర్కొన్నారు. సాక్ష్యాలతో హైదరాబాద్‌లోనే మీడియాతో మాట్లాడతానని పుట్ట మధు చెప్పారు.
న్యాయవాద దంపతుల హత్య విషయంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ బిడ్డ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేకనే తనపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీసులను విచారణ చేయనిస్తారా..? ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి మీరే చేస్తారా? అని పలు మీడియా సంస్థలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శ్రీధర్ బాబు కోట్ల రూపాయలు ఇస్తూ హైదరాబాద్‌లో మీడియాను మేనేజ్ చేస్తే తనకు వ్యతిరేకంగా కథనాలు రాశారని, తన వద్ద డబ్బు లేకుంటే బదనాం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల మంథని నియోజకవర్గ చరిత్రలో బీసీ నాయకుడు ఈ స్థాయికి ఎదగడమే నేరమా అని అన్నారు.